settings icon
share icon
ప్రశ్న

పరలోకమునకు యేసు ఏకైక మార్గమా?

జవాబు


అవును, పరలోకమునకు యేసు ఏకైక మార్గము. ఇట్టి విశిష్ట కథనము అధునాతన చెవికి ఆటంకంగా అనిపించవచ్చు, కాని ఇది సత్యము. యేసు క్రీస్తు ద్వారా గాక రక్షణకు మరొక మార్గము లేదని బైబిల్ బోధిస్తుంది. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” అని యోహాను 14:6లో యేసు స్వయంగా చెప్పుచున్నాడు. అనేక మందిలో ఒకరిగా, ఆయన ఒక మార్గము కాదు; ఏకైక మరియు ఒకేఒక్కరిగా, ఆయనే మార్గము. యేసు ద్వారా తప్ప వారికున్న ఖ్యాతి, సాధకము, విశేష జ్ఞానము, లేక వ్యక్తిగత పవిత్రత వలన ఎవరు తండ్రి యొద్దకు రాలేరు.

యేసు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గమనుటకు అనేక కారణములున్నాయి. యేసు రక్షకునిగా “దేవునిచే ఎంపిక చేయబడెను” (1 పేతురు 2:4). పరలోకము నుండి దిగివచ్చి మరలా తిరిగి వెళ్ళిన ఏకైక వ్యక్తి యేసు మాత్రమే (యోహాను 3:13). సంపూర్ణ మానవ జీవితము జీవించిన ఏకైక వ్యక్తి ఆయనే (హెబ్రీ. 4:15). ఆయనే ఏకైక పాపపరిహారార్థ బలి (1 యోహాను 2:2; హెబ్రీ 10:26). అయన మాత్రమే ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తలను నెరవేర్చెను (మత్తయి. 5:17). అంతము వరకు మరణమును జయించిన మానవుడు ఆయన మాత్రమే (హెబ్రీ. 2:14-25). దేవునికి మానవునికి మధ్య ఆయనే ఏకైక మధ్యవర్తి (1 తిమోతి. 2:5). దేవుడు “అధికముగా... హెచ్చించిన” వ్యక్తి ఆయనే (ఫిలిప్పీ. 2:9).

తానే పరలోకమునకు ఏకైక మార్గమని యోహాను 14:6లో మాత్రమే గాక అనేక పర్యాయములు యేసు స్వయంగా చెప్పెను. మత్తయి. 7:21-27లో తాను విశ్వసించదగినవాడని యేసు స్వయంగా చెప్పెను. ఆయన మాటలు జీవమని ఆయన చెప్పెను (యోహాను 6:63). ఆయనను నమ్మువారు నిత్యజీవము పొందుదురని ఆయన వాగ్దానము చేసెను (యోహాను 3:14-15). ఆయనే గొర్రెలు పోవు ద్వారము (యోహాను 10:7); జీవపు రొట్టె (యోహాను 6:35); మరియు పునరుత్ధానము (యోహాను 11:25). మరెవ్వరు కూడ నిజముగా ఈ బిరుదులను దావా చేయలేరు.

అపొస్తలుల యొక్క బోధ ప్రభువైన యేసు యొక్క మరణము మరియు పునరుత్ధానము మీద దృష్టి నిలిపెను. పేతురు, యూదుల సభలో మాట్లాడుతూ, యేసు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గమని ప్రకటించెను: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను” (అపొ. 4:12). పౌలు, అంతియొకయలోని సమాజ మందిరములో మాట్లాడుతూ, యేసు రక్షకుడని తెలిపెను: “...మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, ...విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక” (అపొ. 13:38-39). యోహాను, సంఘమునకు వ్రాస్తూ, క్రీస్తు నామము మన క్షమాపణకు ఆధారమని ప్రత్యేకముగా చెప్పెను: “చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను” (1 యోహాను 2:12). యేసు తప్ప ఎవరు పాపమును క్షమించలేరు.

పరలోకములో నిత్యజీవము క్రీస్తు ద్వారానే సాధ్యము. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము” అని యేసు ప్రార్థించెను (యోహాను 17:3). దేవుని యొక్క రక్షణ అను ఉచిత బహుమానమును పొందుటకు, మనం యేసు వైపు, యేసు వైపు మాత్రమే చూడవలెను. మన పాపమునకు పరిహారముగా యేసు సిలువ మరణమును మరియు ఆయన పునరుత్ధానమును మనం నమ్మవలెను. “అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది” (రోమా. 3:22).

యేసు పరిచర్యలోని ఒక తరుణంలో, జనసమూహము ఆయనకు వీపు చూపి, మరొక రక్షకుని కనుగొనాలనే ఆశతో ఆయనను విడుచుచుండెను. “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని యేసు పన్నెండు మందిని అడిగెను (యోహాను 6:67). పేతురు యొక్క జవాబు చాలా సరైనది: “ప్రభువా, యెవని

యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను” (యోహాను 6:68-69). నిత్య జీవము యేసు క్రీస్తులోనే ఉన్నదను పేతురు యొక్క విశ్వాసం మనమంతా పంచుకొందుము గాక.

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పరలోకమునకు యేసు ఏకైక మార్గమా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries