settings icon
share icon
ప్రశ్న

దేవుడు ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏమిటి?

జవాబు


మొదటిగా బైబిల్ ప్రేమను ఎలా వర్ణిస్తుందో చూద్దాం, మరియు తర్వాత దేవుడు ప్రేమకు రూపమై ఎలా ఉన్నాడో కొన్ని మార్గములు చూద్దాం. “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును” (1 కొరింథీ. 13:4-8a). ఇది ప్రేమను గూర్చి దేవుని యొక్క వర్ణన, మరియు దేవుడు ప్రేమా స్వరూపి గనుక (1 యోహాను 4:8), ఆయన ఇలానే ఉంటాడు.

ప్రేమ (దేవుడు) తన్ను తాను ఇతరులపై బలవంతం చేయదు. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ప్రేమకు స్పందనగా వస్తారు. ప్రేమ (దేవుడు) అందరికి దయను చూపిస్తుంది. ప్రేమ (యేసు) ఎలాంటి పక్షపాతము లేకుండా అందరికి మేలు చేయుచు సంచరించెను. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా వినయముగా జీవిస్తూ, ప్రేమ (యేసు) ఇతరుల వస్తువులను ఆశించలేదు. తనకు ఎదురుగా వచ్చిన ప్రతివారిని జయించే శక్తి ఉన్నప్పటికీ, ప్రేమ (యేసు) తాను శారీరకంగా ఏమైయుండెనో దానిని గూర్చి గొప్పలు చెప్పుకోలేదు. ప్రేమ (దేవుడు) విధేయతను డిమాండ్ చేయదు. తన కుమారుని నుండి కూడా ప్రేమ (దేవుడు) విధేయతను డిమాండ్ చేయలేదు గాని, యేసు పరలోకమందున తన తండ్రికి ఇష్టపూర్వకంగా విధేయుడాయెను. “అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను” (యోహాను 14:31). ప్రేమ (యేసు) ఎల్లప్పుడూ ఇతరుల అవసరతల కొరకు ఎదురుచూస్తుంది.

దేవుని ప్రేమ యొక్క అతి గొప్ప భావన యోహాను 3:16లో వ్యక్తపరచబడింది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకు మారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” రోమా. 5:8 కూడా అదే సందేశమును ప్రకటిస్తుంది: “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” తన నిత్య గృహమైన పరలోకంలో మనం ఆయనతో చేరాలనేది దేవుని కోరిక అని ఈ వచనాలలో మనం చూడవచ్చు. మన పాపములకు వెల చెల్లించుట ద్వారా ఆయన మార్గమును సరళం చేసెను. అయన చిత్తానుసారంగా కార్యం చెయ్యాలని నిర్ణయం తీసుకొనెను కాబట్టి అయన మనలను ప్రేమించుచున్నాడు. ప్రేమ క్షమిస్తుంది. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).

కాబట్టి, దేవుడు ప్రేమా స్వరూపి అంటే ఏమిటి? ప్రేమ దేవుని యొక్క లక్షణము. ప్రేమ దేవుని స్వభావం మరియు వ్యక్తిత్వం యొక్క ఒక మూలభాగం. దేవుని ప్రేమ ఏ విధంగా కూడా తన పరిశుద్ధత, నీతి, న్యాయం, లేక ఆయన కోపముతో ఘర్షణలో లేదు. దేవుని లక్షణములన్ని పరిపూర్ణ ఐక్యమత్యంలో ఉన్నాయి. దేవుడు చేయు ప్రతిది నీతి మరియు సరైనది అయినట్లే, దేవుడు చేయు ప్రతిది ప్రేమ కలది. నిజమైన ప్రేమకు దేవుడు ఉత్తమ ఉదాహరణ. అద్భుతంగా, తన కుమారుడైన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించువారికి దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ప్రేమించునట్లు ప్రేమించుటకు శక్తిని ఇస్తాడు (యోహాను 1:12; 1 యోహాను 3:1, 23-24).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుడు ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries