ప్రశ్న
మంచి ప్రజలకు కీడు జరుగుటకు దేవుడు ఎందుకు అనుమతి ఇస్తాడు?
జవాబు
వేదాంతము అంతటిలో ఇది అతి కష్టమైన ప్రశ్నలలో ఒకటి. దేవుడు నిత్యుడు, హద్దులులేనివాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, మరియు సర్వజ్ఞాని. దేవుని మార్గములను పూర్తిగా అర్థం చేసుకోవాలని మనుష్యుడు (నిత్యుడు, హద్దులులేనివాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, మరియు సర్వజ్ఞాని కానివాడు) ఎందుకు ఆశించాలి? యోబు గ్రంథము ఈ విషయమును గూర్చి మాట్లాడుతుంది. యోబును చంపుట మినహా వానికి ఇష్టమైనది చేయుటకు సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబు యొక్క ప్రతి స్పందన ఏమిటి? “ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను” (యోబు 13:15). “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక ” (యోబు 1:21). దేవుడు అట్టి విషయములను తన జీవితంలో సంభవించునట్లు అనుమతించుటను యోబు అర్థం చేసుకొనలేకపోయినప్పటికీ, దేవుడు మంచివాడని అతనికి తెలుసు కాబట్టి ఆయనను నమ్ముట కొనసాగించాడు. తుదకు, మన స్పందన కూడా అలానే ఉండాలి.
మంచి ప్రజలకు కీడు ఎందుకు జరుగుతుంది? “మంచి” ప్రజలు లేరనేది దీనిని బైబిల్ జవాబు. మనమంతా పాపముతో కలుషితమై దానిని కలిగియున్నామని బైబిల్ స్పష్టముగా చెబుతుంది (ప్రసంగి 7:20; రోమా. 6:23; 1 యోహాను 1:8). రోమా. 3:10-18 “మంచి” ప్రజలు లేని విషయమును గూర్చి ఇంతకంటే స్పష్టముగా పలుకలేదు: “ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.” ఈ గ్రహం మీద ఉన్న ప్రతి మనిషి ఈ క్షణమే నరకములోనికి త్రోసివేయబడుటకు యోగ్యులు. మనం సజీవంగా గడుపు ప్రతి క్షణం దేవుని యొక్క కృప మరియు కరుణ ద్వారా మాత్రమే. ఇక్కడ మనం అనుభవించు అతి భయంకరమైన సమస్య కూడా మనం అర్హులమైయున్న అగ్ని గుండములోని నిత్య నరకము కంటే తక్కువైనదే.
“దుష్ట ప్రజలకు దేవుడు మేలు ఎందుకు చేస్తాడు?” అనేది దీని కంటే ఉత్తమ ప్రశ్న. “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని రోమా. 5:8 ప్రకటిస్తుంది. ఈ లోక ప్రజల యొక్క చెడ్డ, దుష్ట, పాపపు స్వభావమునకు బదులుగా, దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. మన పాపము యొక్క పరిహారము కొరకు మరణించునంతగా ఆయన మనలను ప్రేమించెను (రోమా. 6:23). మనం యేసును రక్షకునిగా అంగీకరించిన యెడల (యోహాను 3:16; రోమా. 10:9), మనం క్షమించబడి పరలోకంలో నిత్య నివాస వాగ్దానం పొందుతాము (రోమా. 8:1). మనం నరకమునకు మాత్రమే పాత్రులము. విశ్వాసం ద్వారా క్రీస్తులోనికి మనం వస్తే పరలోకంలో నిత్యజీవం మనకు ఇవ్వబడుచున్నది.
అవును, కొన్ని సార్లు చెడుకు అర్హులు కానివారికి కీడు జరుగుతుంది. మనం అర్థం చేసుకున్న చేసుకొనకపోయినా, కొన్ని కారణాల కొరకు దేవుడు కొన్ని సంఘటనలు జరుగుటకు అనుమతి ఇస్తాడు. అయితే, అన్నిటికంటే పైగా దేవుడు మంచివాడని, న్యాయవంతుడని, ప్రేమించువాడని, మరియు కరుణగలవాడని మనం గుర్తుంచుకోవాలి. చాలా సార్లు మనం అర్థం చెసుకొనలేని విషయములు మనకు జరుగుతుంటాయి. అయితే, దేవుడు మంచితనమును సందేహించుటకు బదులు, మన ప్రతిస్పందన ఆయనయందు నమ్మికైయుండాలి. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” (సామెతలు 3:5-6).
English
మంచి ప్రజలకు కీడు జరుగుటకు దేవుడు ఎందుకు అనుమతి ఇస్తాడు?