ప్రశ్న
దయ్యములను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
జవాబు
ప్రకటన 12:9 సూచిస్తున్నట్లు దయ్యములు పడిపోయిన దేవదూతలు: “కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” పరలోకం నుండి సాతాను యొక్క పతనమును యెషయా 14:12–15 మరియు యెహెజ్కేలు 28:12–15 చిత్రాత్మకంగా వర్ణిస్తుంది. అతడు పడిపోయినప్పుడు, సాతాను వానితో కొన్ని దూతలను తీసుకున్నాడు-ప్రకటన 12:4 ప్రకారం వారిలో మూడవ వంతు. యూదా 6 పాపము చేసిన దూతలను గూర్చి ప్రస్తావిస్తుంది. కాబట్టి, లేఖనపరంగా, దయ్యములు సాతానుతో కలసి దేవునిపై తిరుగుబాటు చేయుటకు ఎంచుకొన్న పడిపోయిన దేవదూతలు.
కొన్ని దయ్యములు ఇప్పటికే వారి పాపముల మూలంగా “కటికచీకటిలో నిత్యపాశములతో బంధించి భద్రము చేయబడి”యున్నవి (యూదా 1:6). మిగిలినవి తిరుగులాడుటకు స్వతంత్రులుగా ఉండి ఎఫెసీ. 6:12లో “ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములు”గా వర్ణించబడ్డాయి (చూడండి కొలస్సి. 2:15). దయ్యములు ఇప్పటికీ తమ నాయకుడైన సాతానును అనుసరిస్తూ దేవుని ప్రణాళికకు భంగం కలిగించి దేవుని ప్రజలను ఆపుటకు పరిశుద్ధ దూతలతో యుద్ధము చేస్తుంటాయి (దానియేలు 10:13).
ఆత్మీయ జీవులుగా, దయ్యములకు భౌతిక శరీరములను స్వాధీనం చేసుకొనే శక్తి ఉంది. దయ్యము పట్టుట ఒక వ్యక్తి యొక్క శరీరమును దయ్యము సంపూర్ణంగా ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు జరుగుతుంది. క్రీస్తులో విశ్వాసులకు ఇది జరుగలేదు ఎందుకంటే వారి హృదయాలలో పరిశుద్ధాత్మ నివాసముంటాడు (1 యోహాను 4:4).
యేసు తన భూలోక పరిచర్యలో అనేక దయ్యములను ఎదుర్కొన్నాడు. అయితే, వాటిలో ఏవి ఆయన శక్తి ఎదుట నిలువలేక పోయాయి: “సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి” (మత్తయి 8:16). యేసు నిజముగా దేవుని కుమారుడనుటకు దయ్యములపై ఆయన అధికారం ఒక రుజువుగా ఉంది (లూకా 11:20). యేసును ఎదుర్కొన్న దయ్యములకు ఆయన ఎవరో తెలుసు కాబట్టి, అవి ఆయన అంటే భయపడ్డాయి: “వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి” (మత్తయి 8:29). వాటి అంతము వేదనతో కూడినదని దయ్యములకు తెలుసు.
సాతాను మరియు వాని దయ్యములు ఇప్పుడు దేవుని సృష్టిని నాశనం చేయుటకు మరియు అందరిని మోసం చేయుటకు ప్రయత్నించుచున్నాయి (1 పేతురు 5:8; 2 కొరింథీ 11:14–15). దయ్యములను దుష్ట ఆత్మలుగా (మత్తయి 10:1), అపవిత్రాత్మలుగా (మార్కు 1:27), అబద్ద ఆత్మలుగా (1 రాజులు 22:23), మరియు సాతాను దూతలుగా (ప్రకటన 12:9) వర్ణించబడ్డాయి. సాతాను మరియు వాని ఆత్మలు లోకమును మోసం చేస్తాయి (2 కొరింథీ. 4:4), అబద్ధ సిద్ధాంతమును ప్రకటిస్తాయి (1 తిమోతి 4:1), క్రైస్తవులపై దాడి చేస్తాయి (2 కొరింథీ. 12:7; 1 పేతురు 5:8), మరియు పవిత్ర దూతలతో పోరాడతాయి (ప్రకటన 12:4–9).
దయ్యములు/పడిపోయిన దూతలు దేవుని విరోధులు, కాని వారు ఓడిపోయిన విరోధులు. “ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను” (కొలస్సి. 2:15). మనం దేవునికి లోబడి అపవాదిని ఎదురించుచుండగా, మనకు భయపడవలసిన పని లేదు. “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు” (1 యోహాను 4:4).
English
దయ్యములను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?