settings icon
share icon
ప్రశ్న

పరలోకములోనున్న ప్రజలు క్రిందికి చూచి ఇంకను భూమి మీదనున్న మనలను చూడగలరా?

జవాబు


కొందరు హెబ్రీయులకు 12:1ను అనుసరించి ప్రజలు పరలోకములో నుండి క్రిందికి చూసి మనలను చూడగలరు అని భావిస్తుంటారు: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున...” ఈ సాక్షులు ఎవరనగా హెబ్రీయులకు 11వ అధ్యాయములో పొందుపరచబడిన విశ్వాసవీరులు, మరియు మనము వారిచే ఆవరించబడియున్నామనే సత్యము కొందరు వ్యాఖ్యాతలకు ఈ వీరులు (మరియు ఇతర ప్రజలు కూడా) మనలను పరలోకము నుండి చూస్తున్నారు అనే వాదనను వినిపించునట్లుగా చేస్తున్నది.

మనము ఏమి చేయుచున్నామో పరలోకములో ఉన్నవారు మనలను చూస్తున్నారు అనే ఆలోచన ప్రముఖమైన సంప్రదాయాలలో సాధారణమైన విషయమే. కాని, మనలను విడిచి వెళ్ళిన మన ప్రియులు మనలను చూస్తూ ఉన్నారు అనే ఆలోచన మనకు ఉన్నప్పటికీ, హెబ్రీయులకు 12:1 బోధిస్తున్నది ఇది కాదు. హెబ్రీయులకు 11వ అధ్యాయమును అనుసరించి, రచయిత కొన్ని ప్రయోగాత్మకమైన పాఠములను నిర్మించుటకు చూస్తున్నాడు (అందువలననే 12వ అధ్యాయము కొన్ని అనువాదములలో “కాబట్టి” అనే మాటతో ఆరంభమౌతుంది). ఈ “సాక్షులు” ఎవరనగా దేవుడు 11వ అధ్యాయములో వారి విశ్వాసమును బట్టి అభినందించినవారు, మరియు వారి యోక్క్ సమూహము పరలోకములో చాలా పెద్దదిగానే ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమంటే, వారు ఏ విధంగా “సాక్షులు”?

హెబ్రీయులకు 12:1 యొక్క సరియైన విశదము ఏదనగా ఈ “సాక్షి సమూహము”గా ఏర్పడుతున్న స్త్రీపురుషులు విశ్వాస మూలముగా జీవించే జీవితము యొక్క విలువకు సాక్షులు. పాత నిబంధనలో వారిని గూర్చి ఉన్న కథనములు భయమునకు బదులుగా విశ్వాసమును ఎన్నుకొనుటవలన కలిగే ఆశీర్వాదములను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. హెబ్రీయులకు 12:1 వాక్యమును సుళువైన మాటలలో చెప్పాలంటే, “ఋజువు చేయబడిన విశ్వాసమును ప్రయత్నించిన-మరియు-సత్యమైన మాదిరిలు మనకు అనేకములైనవి ఉన్నందున . . . “ కాబట్టి, ప్రజలు పరలోకములో ఉండి మనలను చూస్తున్నారు అనేది కాదు (అంటే ఏదో ఈ భూమిపైన మన జీవితములు ఎంతో ఆశక్తికరంగా ఉన్నాయని లేదా వారికి పని ఏమియు లేనట్లుగా!), కాని మనకంటే ముందుగా వెళ్ళినవారు మనకొరకు ఒక శాశ్వతమైన మాదిరిని ఉంచి వెళ్ళారు. వారి జీవితములను గూర్చిన నమోదిత సమాచారము విశ్వాసమునకు దేవుని గూర్చియు మరియు సత్యమును గూర్చియు సాక్ష్యమునిచ్చేదిగా ఉంది.

హెబ్రీయులకు 12:1 కొనసాగుతూ, “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని చెప్తుంది. మనకంటే ముందుగా వెళ్ళిన విశ్వాసుల యొక్క విశ్వాస సహనముల కారణముగా, మన సొంత విశ్వాస పందెపు రంగములో నిలకడగా ఉండునట్లు మనము ప్రేరేపించబడుతున్నాము. అబ్రాహాము మరియు మోషే మరియు రాహాబు మరియు గిద్యోను మున్నగువారి యొక్క మాదిరిని మనము అనుసరిస్తున్నాము.

లూకా 16:28లో ధనవంతుడు తన సహోదరులను గూర్చి ప్రస్తావిస్తున్న సందర్భమును తీసుకొని విడువబడిన ఆత్మలు (అంటే కనీసం పాతాళములో ఉన్న) భూమిపై సంభవిస్తున్న సంఘటనలను చూడగలరు అని కొందరు అంటుంటారు.కాని, ఆ ధనవంతుడు నిజముగా తన సహోదరులను చూచాడు అని మాత్రము ఈ వాక్యము ఎక్కడా చెప్పుటలేదు; ఆయనకు సహోదరులు ఉన్నారు అని మాత్రం తెలుసు, మరియు వారు అవిశ్వాసులుగా ఉన్నారని కూడా ఆయనకు తెలుసు. ఇంకా చూచినట్లయితే, ఇంకొంత మంది ప్రకటన 6:10వ వచనమును ఋజువు వాక్యముగా ప్రయోగిస్తారు: శ్రమల కాలములో హతసాక్షులుగావించ బడినవారు తమ హత్యలకు ప్రతీకారము తీర్చుకొనమని దేవుని వేడుకుంటారు. మరలా, ఈ హతసాక్షులు భూమి మీదనున్న ప్రజలను చూస్తున్నారు అని మాత్రం వాక్యము చెప్పుటలేదు; వారికి న్యాయం జరగాలి అనియు మరియు ప్రభువే ఆ న్యాయమును జరిగించాలని వారు ఆశకలిగినట్లుగా ఉన్నారు.

పరలోకములో ఉన్న ప్రజలు క్రిందికి మనలను చూడలేరు అని ప్రత్యేకముగా పరిశుద్ధగ్రంధము చెప్పుటలేదు, కాబట్టి ఇక్కడ మనము సిద్ధాంతపరముగా ఉండలేము. కానీ, వారు అలా చూడడం అనేది అంతగా సాధ్యపడే విషయమైతే కాదు. పరలోకములో ఉన్న ప్రజలు దేవుని యొక్క ఆరాధన మరియు పరలోకపు మహిమలను చూచి తరించే ఇతర కార్యక్రమాలలో నిమగ్నులైయుంటారని మాత్రము మనము చెప్పగలం.

పరలోకములో ఉన్న ప్రజలు క్రిందికి చూచి మనలను చూడగలరా లేదా అనే విషయముతో సంబంధము లేకుండా, మనము మన పందెమును వారికొరకు అయితే పరుగెత్తుటలేదు. వారి యొక్క ఆమోదము కొరకో లేదా వారి యొక్క అభినందనలను వినుటకో మనము ఆశించుటలేదు. హెబ్రీయులకు 12:2 వచనము మన దృష్టిని ఉండవలసిన చోట ఉంచమని చెప్తుంది: “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు.” యేసే మన ఆశీర్వాదపూర్వకమైన నిరీక్షణ, మరి ఎవ్వరూ కాదు (తీతుకు 2:13).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పరలోకములోనున్న ప్రజలు క్రిందికి చూచి ఇంకను భూమి మీదనున్న మనలను చూడగలరా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries