settings icon
share icon
ప్రశ్న

యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా?

జవాబు


“నేను దేవుడను” అను ఖచ్చితమైన మాటలను యేసు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా నమోదు చేయబడలేదు. అలాగంటే, ఆయన దేవుడను కానని చెప్పినట్లుగా కాదు. ఉదాహరణకు యోహాను 10:30లో యేసు పలికిన మాటలను తీసుకోండి, “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” ఆయన చెప్పిన ఈ మాటకు ఆయన స్పందనను తీసుకుంటే ఆయన దేవుడనని చెప్తున్నట్లుగా ఉంది. ఈ కారణము చేతనే అక్కడివారు ఆయనను రాళ్ళతో కొట్టుటకు సిద్ధమయ్యారు “...నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు” అన్నారు (యోహాను 10:33). యేసు ఏమి చేపున్నాడో యూదులు ఖచ్చితంగా అర్ధం చేసుకున్నారు – తను దేవుడనని. దేవునిగా ఆయన చెప్పుకొనుటను ఆయన విస్మరించలేదు. “నేనును తండ్రియును ఏకమైయున్నాము” అని ఆయన చెప్పినప్పుడు ఆయన మరియు తండ్రి ఇద్దరు ఒకే స్వభావము మరియు మూలమును కలిగియున్నారని ఆయన అర్ధము. యోహాను 8:58లో ఇంకొక ఉదాహరణ ఉంది. యేసు చెప్పాడు “అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” ఈ వాక్యమును విన్న యూదుల యొక్క స్పందన ఏమంటే దేవదూషణ చేయుచున్నాడని, మోషే ధర్మశాస్త్రము వారిని నిర్దేశించినట్లుగా ఆయనను చంపుటకు (లేవీయ. 24:15) రాళ్ళు తీసుకొనబోయారు.

యేసు యొక్క దైవత్వమును యోహాను పునరుద్ఘాటిస్తున్నాడు: “వాక్యమే దేవుడైయుండెను” మరియు “వాక్యము శరీరధారి యాయెను” (యోహాను 1:1, 14). యేసు శరీరములో ఉన్న దేవుడని ఈ వచనములు స్పష్టంగా సూచిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 20:28లో “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ... జాగ్రత్తగా ఉండుడి” అని చదువుతాం. సంఘమును – దేవుని సంఘమును – తన స్వరక్తమిచ్చి కొన్నది ఎవరు? యేసు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 20:28 దేవుడు సంఘమును తాన సొంత రక్తము ఇచ్చి కొన్నాడని చెప్తుంది. కాబట్టి యేసు దేవుడే!

శిష్యుడైన తోమా యేసును గూర్చి చెప్పాడు, “నా ప్రభువా మరియు నా దేవా” అని (యోహాను 20:28). యేసు ఆయనను సరిచేయలేదు. తీతుకు 2:13 మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టమని ప్రోత్సహిస్తుంది (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ పత్రిక 1:8లో యేసును గూర్చి తండ్రి మాట్లాడుతూ, “తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది” అని అన్నాడు. తండ్రి యేసును “దేవా” అని సంబోధించడం యేసు నిజముగా దేవుడేనని సూచిస్తుంది.

ప్రకటన గ్రంధంలో దూత అపొస్తలుడైన యోహానును దేవుని మాత్రమే ఆరాధించమని ఉపదేశించింది (ప్రకటన 19:10). లేఖనములలో పలుమార్లు యేసు ఆరాధనను అందుకున్నాడు (మత్తయి 2:11, 14:33, 28:9, లూకా 24:52; యోహాను 9:38). ఆయనను ఆరాధించినందుకు ఎప్పుడు ప్రజలను ఆయన గద్దించలేదు. యేసు ఒకవేళ దేవుడు కాకపోతే, ఆయనను ఆరాధించవద్దని ప్రజలకు, అంటే ప్రకటన గ్రంధంలో ఆ దూత చెప్పినట్లుగానే, చెప్పేవాడు. యేసు దైవత్వమును గూర్చి వాదించి మాట్లాడే అనేక ఇతర వచనములు వాక్యభాగములు లేఖనాల్లో ఉన్నాయి.

యేసు తప్పకుండా దేవుడే అయి ఉండవలసిన ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఒకవేళ ఆయన దేవుడు కాకపొతే, ఈ లోకపు పాపములను పరిహరించుటకు ఆయన చెల్లించిన క్రయధనము సరిపోయేది కాదు (1 యోహాను 2:2). సృష్టించబడిన వ్యక్తి, అంటే యేసు ఒకవేళ దేవుడు కాకుంటే ఇదే అయి ఉంటాడు, అనంతమైన దేవునికి పాపమును బట్టి చెల్లించవలసిన అనంతమైన క్రయధనమును చెల్లించలేడు. దేవుడు మాత్రమే లోకపు పాపములను మోసికొనగలడు (2 కొరింథీ. 5:21), మరణించి, పునరుత్ధానుడై లేచి, పాపము మరియు మరణముపై తన విజయాన్ని నిరూపించాడు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు దేవుడేనా? యేసు తాను దేవుడనని ఎప్పుడైనా అన్నాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries