ప్రశ్న
మనం పరిశుద్ధాత్మను ఎప్పుడు/ఎక్కడ పొందుతాము?
జవాబు
యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తక్షణమే మనం పరిశుద్ధాత్మను పొందుతామని అపొస్తలుడైన పౌలు స్పష్టముగా బోధించుచున్నాడు. “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” అని 1 కొరింథీ. 12:13 ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియుండని యెడల, అతడు లేక ఆమె క్రీస్తుకు చెందినవారు కాదని రోమా 8:9 చెబుతుంది: “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.” విశ్వసించువారందరికీ పరిశుద్ధాత్మ రక్షణ ముద్రగా ఉందని ఎఫెసీ. 1:13-14 బోధిస్తుంది: “మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.”
రక్షణ పొందిన క్షణంలో పరిశుద్ధాత్మను మనం పొందామని ఈ మూడు లేఖన భాగములు స్పష్టము చేయుచున్నవి. కొరింథీ విశ్వాసులు ఒకే ఆత్మను కలిగియుండని యెడల, మనమంతా ఒక ఆత్మ ద్వారా రక్షణ పొందామని మరియు త్రాగుటకు ఒకే ఆత్మ మనకు ఇవ్వబడినదని పౌలు చెప్పియుండేవాడు కాదు. ఒక వ్యక్తి యొద్ద ఆత్మ లేనియెడల, అతడు క్రీస్తుకు చెందినవాడు కాదు అని రోమా. 8:9 మరింత బలముగా చెబుతుంది. కాబట్టి, ఆత్మ కలిగియుండుట రక్షణను కలిగియుండుటకు గుర్తింపుగా ఉంది. అంతేగాక, ఆయనను రక్షణ పొందిన తక్షణం మనం పొందనియెడల, పరిశుద్ధాత్మ “రక్షణ ముద్ర” కాలేదు (ఎఫెసీ. 1:13-14). క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తక్షణం మన రక్షణ భద్రపరచబడినది అని అనేక లేఖనములు స్పష్టము చేయుచున్నవి.
పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు చాలా సార్లు సందిగ్ధంగా ఉంటాయి కాబట్టి ఈ చర్చ వివాదాస్పదమైనది. ఆత్మను పొందుట/నిండియుండుట రక్షణ పొందిన తక్షణమే కలుగుతుంది. ఆత్మ బాప్తిస్మము కూడా రక్షణ పొందిన క్షణంలో జరుగుతుందని మేము నమ్మినప్పటికీ, కొందమంది క్రైస్తవులు నమ్మరు. దీని వలన ఆత్మ బాప్తిస్మము మరియు రక్షణ పొందిన తరువాత “ఆత్మను పొందుకొనుట” మధ్య కొన్ని సార్లు సందిగ్ధం ఏర్పడుతుంది.
ముగింపుగా, మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుతాము? ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుతాము (యోహాను 3:5-16). మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుతాము? మనం నమ్మిన మరుక్షణం ఆత్మ మన స్థిర స్వాస్థ్యమవుతుంది.
English
మనం పరిశుద్ధాత్మను ఎప్పుడు/ఎక్కడ పొందుతాము?