settings icon
share icon
ప్రశ్న

యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనగానేమి?

జవాబు


దేవుడు సమస్త విషయములను తన ఆధీనంలో ఉంచుకున్నాడనియు, తన వాక్యములో ఆయన చేసిన వాగ్ధానముల పట్లను మరియు ప్రవచనముల పట్లను నమ్మదగినవాడనియు యేసుక్రీస్తు యొక్క ఈ రెండవ రాకడ విశ్వాసులందరికీ ఒక నిరీక్షణ కలిగించే సంఘటన. తన మొదటి రాకడలో, యేసుక్రీస్తు ప్రవచించబడిన రీతిగానే బెత్లెహేములో ఒక పశువులపాకలో బాలునిగా పుట్టాడు. తన పుట్టుక ద్వారా, జీవితము, పరిచర్య, మరణ పునరుత్థానముల ద్వారా మెస్సీయను గూర్చి చేయబడిన అనేక ప్రవచనములను నెరవేర్చాడు. అయినప్పటికీ, మెస్సీయను గూర్చి చేయబడిన ప్రవచనములు యేసుక్రీస్తు నెరవేర్చనివి ఇంకా కొన్ని ఉన్నాయి. మిగిలియున్న ఈ ప్రవచనములను నెరవేర్చుటకు గాను క్రీస్తు యొక్క రెండవ రాకడ క్రీస్తు పునరాగమనాన్ని సూచిస్తుంది. తన మొదటి రాకడలో, యేసు బాధింపబడిన ఒక సేవకునిలా వచ్చాడు. తన రెండవ రాకడలో ఆయన జయించే రాజుగా వస్తాడు. తన మొదటి రాకడలో, చాలా దీనమైన పరిస్థితుల మధ్య వచ్చాడు. తన రెండవ రాకడలో, తన ప్రక్కలో పరలోక సైన్యముతో వస్తాడు.

ఈ రెండు రాకడలకు ఉండవలసిన విశిష్టతలను పాతనిబంధన ప్రవక్తలు అంత స్పష్టంగా చెప్పలేదు. యెషయా 7:14; 9:6-7 మరియు జెకర్యా 4:4లో వీటిని చూడవచ్చు. ఈ ప్రవచనములో ఇద్దరు వ్యక్తుల యొక్క రాకడను గూర్చి మాట్లాడుతున్నట్లుగా ఉండుట వలన, బాధింపబడిన మెస్సీయ మరియు జయించే మెస్సీయ అని ఇద్దరు ఉంటారని యూదుల పండితులు విశ్వసించారు. అక్కడ అసలు ఉన్నది ఒకే మెస్సీయ అనియు ఈ రెండు పాత్రలను ఆయనే పోషిస్తాడనియు వారు అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు. తన మొదటి రాకడలో యేసుక్రీస్తు బాధింపబడుతున్న మెస్సీయ పాత్రను పోషించాడు (యెషయా 53). తన రెండవ రాకడలో యేసు ఇశ్రాయేలు యొక్క విమోచకుడుగా మరియు రాజుగా తన పాత్రను పోషిస్తాడు. రెండవ రాకడను గూర్చి ప్రస్తావిస్తూ జెకర్యా 12:10 మరియు ప్రకటన 1:7 యేసుక్రీస్తు పొడవబడిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాయి. మెస్సీయ మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించనందుకు ఇశ్రాయేలు మరియు ప్రపంచమంతయు రోదిస్తాయి.

యేసు పరలోకమునకు ఎక్కి వెళ్ళిన తరువాత, అపొస్తలులతో దూతలు మాట్లాడుతూ, గలిలయ మనుష్యులారా! మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట చూచితిరో ఆ రీతిగానే ఆయన తెరిగి వచ్చునని చెప్పిరి” (అపొ.కా. 1:11). రెండవ రాకడ చోటుచేసుకొనే ప్రదేశమును జెకర్యా 14:4 ఒలీవ కొండగా గుర్తిస్తుంది. “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకలగోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు” అని మత్తయి 24:30 ప్రకటిస్తుంది. తీతుకు 2:13 ఈ రెండవ రాకడను “మహిమ యొక్క ప్రత్యక్షత”గా వివరిస్తుంది.

ప్రకటన 19:11-16లో ఈ రెండవ రాకడ మరింత వివరణాత్మకముగా చెప్పబడింది, “మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.”

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనగానేమి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries