ప్రశ్న
యేసు శుక్రవారమున సిలువవేయబడెనా?
జవాబు
యేసు వారంలో ఏ రోజు సిలువవేయబడెనో బైబిల్ స్పష్టముగా చెప్పదు. శుక్రవారం మరియు బుధవారం ఎక్కువగా అంగీకరించు ఆలోచనలు. అయితే, శుక్రవారం మరియు బుధవారం తర్కముల కొందరు ఉపయోగించి, గురువారం ఆ రోజని చెబుతారు.
“యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును” అని యేసు మత్తయి 12:40లో చెప్పెను. శుక్రవారము సిలువవేయబడుటను నమ్మువారు, యేసు మూడు రోజులు సమాధిలో ఉండుటకు యోగ్యమైన మార్గము ఉందని వాదిస్తారు. మొదటి శతాబ్దము యొక్క యూదా ఆలోచనలో, ఒక రోజులోని భాగమును కూడా ఒక పూర్తి రోజుగా భావిస్తారు. యేసు శుక్రవారంలో కొంత భాగం, శనివారమంతా, మరియు ఆదివారములో కొంత సమయం సమాధిలో ఉన్నాడు కాబట్టి-ఆయన సమాధిలో మూడు రోజులు ఉన్నాడని పరిగణించవచ్చు. శుక్రవారమునకు ముఖ్య తర్కము మార్కు 15:42లో ఉంది, మరియు యేసు “విశ్రాంతి దినమునకు ముందు రోజు” సిలువవేయబడెనని చెబుతుంది. అది వార విశ్రాంతి దినము, అనగా శనివారం, అయినయెడల అది శుక్రవార సిలువవేయబడుటకు దారితీస్తుంది. మత్తయి 16:21 మరియు లూకా 9:22 వంటి వచనాలలో యేసు మూడవ రోజున తిరిగిలేస్తాడని బోధిస్తాయని శుక్రవార తర్కము చెబుతుంది; కాబట్టి, ఆయన పూర్తిగా మూడు రోజులు సమాధిలో ఉండవలసిన పని లేదు. ఈ వచనాలకు కొన్ని అనువాదాలు “మూడవ రోజున” అను మాటను ఉపయోగించినప్పటికీ, అన్ని ఇలా అనువదించవు, మరియు ఈ వచనములను అనువదించుటకు “మూడవ రోజున” అనే అనువాదం ఉత్తమమైనదని అందరు అంగీకరించరు. అంతేగాక, యేసు మూడు రోజుల “తరువాత” తిరిగిలేస్తాడని మార్కు 8:31 చెబుతుంది.
గురువార వాదము శుక్రవార ఆలోచనను పొడిగిస్తూ, శుక్రవారము సాయంత్రం మరియు ఆదివారం ఉదయము మధ్య జరుగుటకు వీలులేనన్ని అనేక సంఘటనలు (సుమారుగా ఇరవై అని కొందరు లెక్కపెడతారు) క్రీస్తు సమాధి మరియు ఆదివారం ఉదయం మధ్య జరిగాయని వాదిస్తుంది. శుక్రవారం మరియు ఆదివారమునకు మధ్య యూదుల విశ్రాంతి దినమైన శనివారం మాత్రమే పూర్తి రోజుగా ఉందనుటలో సమస్య ఉందని గురువార వాదము వారు వాదిస్తారు. ఒకటి లేక రెండు రోజులు ఎక్కువగా ఉంటే ఆ సమస్య తొలగిపోతుంది. కాబట్టి గురువార వాదులు ఈ విధంగా తర్కిస్తారు: మీరు ఒక స్నేహితుని సోమవారం సాయంత్రం నుండి కలవలేదు అనుకోండి. మీరు అతనిని గురువారం ఉదయం కలుస్తారు మరియు అంటారు, “నేను నిన్ను మూడు రోజులుగా చూడలేదు” అని అంటారు, కాని వాస్తవానికి 60 గంటలు మాత్రమే అయ్యింది (2.5 రోజులు). యేసు గురువారం సిలువవేయబడినయెడల, అది మూడు రోజులుగా ఎలా పరిగణించబడగలదు అని ఈ ఉదాహరణ చెబుతుంది.
ఆ వారంలో రెండు విశ్రాంతి దినములు ఉన్నాయని బుధవార వాదులు చెబుతారు. మొదటి దాని తరువాత (సిలువవేయబడిన రోజు సాయంత్రం సంభవించిది [మార్కు 15:42; లూకా 23:52-54]), స్త్రీలు సుగంధ ద్రవ్యాలను కొన్నారు (మార్కు 16:1). ఆ “విశ్రాంతి దినము” పస్కా పండుగ అని బుధవార వాదులు అంటారు (లేవీ. 16:29-31, 23:24-32, 39 చూడండి, వారమునకు ఏడవ రోజు కాకపోయినా కొన్ని పరిశుద్ధ దినములను విశ్రాంతి దినముగా సంబోధించేవారు). ఆ వారములో రెండవ విశ్రాంతి దినము సాధారణ వార విశ్రాంతి దినము. లూకా 23:56లో, మొదటి విశ్రాంతి దినము తరువాత సుగంధ ద్రవ్యాలను కొనిన స్త్రీలు తిరిగివచ్చి వాటిని సిద్ధపరచి విశ్రాంతి దినమున, “విశ్రమించారని” గమనించండి. రెండు విశ్రాంతి దినములు లేనియెడల, వారు విశ్రాంతిదినము తరువాత సుగంధ ద్రవ్యాలను కొని, వాటిని విశ్రాంతి దినమునకు ముందు సిద్ధపరచు అవకాశం లేదని వారు వాదిస్తారు. రెండు విశ్రాంతి దినముల ఆలోచన ఆధారంగా, క్రీస్తు గురువారం సిలువవేయబడినయెడల, ఆ పరిశుద్ధ విశ్రాంతి దినము (పస్కా) గురువారం సూర్యాస్తమయం తరువాత ఆరంభమై శుక్రవారం సూర్యాస్తమయం తరువాత ముగుసియుంటుంది-వార విశ్రాంతి దినము లేక శనివారం యొక్క ఆరంభములో. మొదటి విశ్రాంతి దినము (పస్కా) తరువాత వారు సుగంధ ద్రవ్యములను కొనుట అనగా వారు వాటిని శనివారం కొని విశ్రాంతి దినమును ఉల్లంఘించారు.
కాబట్టి, బుధవార ఆలోచన ప్రకారం, స్త్రీలు మరియు సుగంధ ద్రవ్యాలను గూర్చి లేఖన బోధను ఉల్లంఘించకుండా మత్తయి 12:40 యొక్క అక్షరార్థ అర్థమును పట్టుకొని ఉండేది, క్రీస్తు బుధవారం సిలువవేయబడెను అనే ఆలోచన మాత్రమే. గొప్ప పరిశుద్ధ దినమున (పస్కా) సంభవించిన విశ్రాంతి దినం గురువారం వచ్చింది, స్త్రీలు (దాని తరువాత) శుక్రవారమున సుగంధ ద్రవ్యాలు కొన్నారు, వార విశ్రాంతి దినమైన శనివారం విశ్రాంతి తీసుకున్నారు, తరువాత ఆదివారం ఉదయాన సుగంధ ద్రవ్యాలను సమాధి యొద్దకు తెచ్చారు. యేసు బుధవారం సూర్యాస్తమయమున సమాధి చేయబడెను, అది యూదా క్యాలెండరులో గురువారమునకు ఆరంభము. యూదుల క్యాలెండరును ఉపయోగించి, గురువారం రాత్రి (మొదటి రాత్రి), గురువారం పగలు (మొదటి పగలు), శుక్రవారం రాత్రి (రెండవ రాత్రి), శుక్రవారం పగలు (రెండవ పగలు), శనివారం రాత్రి (మూడవ రాత్రి), శనివారం పగలు (మూడవ పగలు) ఉన్నాయి. ఆయన ఖచ్చితముగా ఏ సమయంలో తిరిగిలేచెనో మనకు తెలియదు, కాని అది ఆదివారం సూర్యోదయమునకు ముందు అని మనకు తెలుసు. ఖాళీ సమాధిని సూర్యోదయమున (మార్కు 16:2), అనగా పూర్తిగా వెలుగు రాకమునుపు కనుగొన్నారు (యోహాను 20:1).
బుధవార వాదములో ఉన్న సమస్య ఏమిటంటే, ఎమ్మాయి మార్గమున యేసుతో నడచిన శిష్యులు పునరుత్థానము జరిగిన “రోజునే” నడిచారు (లూకా 24:13). యేసును గుర్తించని శిష్యులు, ఆయనకు యేసు యొక్క సిలువవేయబడుటను (24:21) గూర్చి చెబుతూ “యీ సంఘటనలు జరిగి నేటికి మూడు దినములాయెను” అని ఆయనతో అన్నారు (24:22). బుధవారం నుండి ఆదివారం నాలుగు రోజులు. వారు క్రీస్తు సమాధి చేయబడిన బుధవారం సాయంత్రం నుండి అనగా యూదా గురువారం నుండి లెక్కబెడతారనేది మరొక వాదన, మరియు గురువారం నుండి ఆదివారమును మూడు రోజులుగా లెక్కించవచ్చు.
అయితే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని, క్రీస్తు వారములో ఏ రోజున సిలువవేయబడెను అను విషయమును తెలుసుకొనుట అంత ముఖ్య విషయము కాదు. అది అంత ప్రాముఖ్యమైన విషయమైన యెడల, దేవుని వాక్యము ఆ రోజును సమయమును స్పష్టముగా చెప్పియుండేది. అయితే ఆయన నిజముగా మరణించాడు మరియు మరణము నుండి శారీరకముగా తిరిగిలేచాడు అనునది ప్రాముఖ్యమైన విషయం. మరియు ఆయన మరణించుటకు కారణం కూడా అంతే ముఖ్యమైనది-పాపులందరి శిక్షను తనపై వేసుకొనుట. ఆయనను నమ్ముట నిత్యజీవమునిస్తుందని యోహాను 3:16 మరియు 3:36 చెబుతున్నాయి! ఆయన బుధవారం, గురువారం లేక శుక్రవారంలో ఏ రోజు సిలువవేయబడినా ఇవి అంతే ప్రాముఖ్యమైనవి.
English
యేసు శుక్రవారమున సిలువవేయబడెనా? అయినయెడల, ఆయన ఆదివారము తిరిగిలేస్తే ఆయన మూడు రోజులు సమాధిలో ఎలా గడిపాడు?