settings icon
share icon
ప్రశ్న

స్త్రీ కాపరులు/ప్రసంగీకులు? పరిచర్యలో స్త్రీలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు


స్త్రీలు కాపరులుగా/ప్రసంగీకులుగా పరిచర్య చేయుట అనునది నేడు సంఘములలో ఎక్కువగా వాదించు విషయం. కాబట్టి, ఈ సమస్యను స్త్రీ పురుషుల మధ్య పోటిగా చూడకూడదు. స్త్రీలు కాపరులుగా పని చేయకూడదని మరియు స్త్రీల పరిచర్య మీద బైబిల్ ఆంక్షలు విధించిందని వాదించు స్త్రీలు ఉన్నారు, మరియు స్త్రీలు ప్రసంగీకులుగా ఉండవచ్చని మరియు స్త్రీల పరిచర్యపై బైబిల్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని వాదించు పురుషులు కూడా ఉన్నారు. ఇది పైచేయి లేక పక్షపాతం అను విషయం కాదు. ఇది బైబిల్ అనువాదమునకు సంబంధించినది.

దేవుని వాక్యం చెబుతుంది, “స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను” (1 తిమోతి 2:11-12). సంఘములో, దేవుడు స్త్రీ పురుషులకు వేర్వేరు పాత్రలు పురమాయిస్తాడు. ఇది మానవులు సృష్టించబడిన విధానం మరియు పాపం లోకములోనికి ప్రవేశించిన విధానం యొక్క పరిణామం (1 తిమోతి 2:13-14). అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు, స్త్రీలను బోధించు పాత్రలను తీసుకొనుట నుండి మరియు/లేక పురుషులపై ఆత్మీయ అధికారం కలిగియుండుట నుండి ఆపుతాడు. అంటే ఇది స్త్రీలు పురుషులకు కాపరులుగా ఉండుట నుండి అనగా, బహిరంగంగా వారికి బోధించుట, వారిపై ఆత్మీయ అధికారం కలిగియుండుట నుండి ఆపుతుంది.

కాపరి పరిచర్యలో స్త్రీలను గుర్చిన ఈ ఆలోచనకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఆదిమ శతాబ్దంలో స్త్రీలు నిరక్షరాస్యులు కాబట్టి పౌలు వారిని బోధించకుండా ఆంక్షలు విధించాడని ఒక సామాన్య అభ్యంతరం. అయితే, 1 తిమోతి 2:11–14 ఎక్కడా కూడా విద్య స్థాయిని ప్రస్తావించలేదు. పరిచర్యకు విద్య ఒక అర్హత అయ్యుంటే, యేసు శిష్యులలో చాలామంది అర్హులు అయ్యేవారు కాదు. పౌలు కేవలం ఎఫెసులో ఉన్న స్త్రీలను మాత్రమే పురుషులకు బోధించకుండా ఆంక్షలు విధించాడు అనేది రెండవ అభ్యంతరం (1 తిమోతి ఎఫెసీ సంఘ కాపరియైన తిమోతికి వ్రాయబడినది). ఎఫెసు పట్టణము అర్తమయి దేవత యొక్క దేవాలయమునకు ప్రసిద్ధి కాబట్టి, మరియు ఆ విగ్రహారాధనలో స్త్రీలు అధికారం కలిగియుండేవారు కాబట్టి – పౌలు ఎఫెసు విగ్రహారాధనలో స్త్రీలు నడిపించు పూజలకు స్పందిస్తున్నాడు, మరియు సంఘము వారికి వేరుగా ఉండాలి అని మరొక సిద్ధాంతం చెబుతుంది. అయితే, తిమోతికి వ్రాసిన పత్రికలో అర్తమయిని గూర్చి ఎలాంటి ప్రస్తావన లేదు, మరియు 1 తిమోతి 2:11–12లో విధించిన అంక్షలకు అర్తమయి ఆరాధన కారణమని కూడా పౌలు చెప్పుట లేదు.

పౌలు కేవలం భార్య భర్తలను సంభోదిస్తున్నాడు, సాధారణ స్త్రీ పురుషులను కాదనేది మూడవ అభ్యంతరం. 1 తిమోతి 2లోని “స్త్రీ” మరియు “పురుషునికి” ఉపయోగించిన గ్రీకు పదములు భార్య భర్తలను సంబోధించవచ్చు; అయితే, ఆ పదాల యొక్క అర్థం అంత కంటే ఎక్కువగా ఉంది. అంతేగాక, అవే గ్రీకు పదాలు 8-10 వచనాలలో కూడా ఉపయోగించబడినవి. కోపం మరియు పోట్లాడటం లేకుండా భర్తలు మాత్రమే చేతులు పైకేత్తాలా (వచనం 8)? కేవలం భార్యలు మాత్రమే మంచిగా వస్త్రములు ధరించి, సత్ క్రియలు చేయుచు, దేవుని ఆరాధించాలా (వచనములు 9–10)? ఖచ్చితంగా కాదు. వచనములు 8–10 స్పష్టముగా స్త్రీ మరియు పురుషులను సంబోధిస్తున్నాయి, కేవలం భార్య భర్తలను మాత్రమే కాదు. వచనములు 11–14లో కేవలం భార్య భర్తలను సూచించుటకు ఎలాంటి సందర్భము లేదు.

ఈ అనువాదమునకు మరొక అభ్యంతరము, కాపరి పరిచర్యలో ఉన్న స్త్రీలు బైబిల్ లో నాయకత్వ స్థానములను కలిగియున్న స్త్రీలతో అనగా, పాత నిబంధనలో మిరియాము, దెబోరా, హుల్దా వంటి వారితో అనుబంధం కలిగియున్నారు. ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఈ స్త్రీలను ఎన్నుకొన్న మాట వాస్తవమే మరియు వారు విశ్వాసానికి, ధైర్యానికి, మరియు అవును, నాయకత్వానికి మాదిరిగా ఉన్నారు. అయితే, పాత నిబంధనలో ఉన్న స్త్రీల అధికారం సంఘములోని కాపరుల విషయంతో తగినదిగా లేదు. క్రొత్త నిబంధన పత్రికలు దేవుని ప్రజలకు –సంఘమునకు, క్రీస్తు శరీరమునకు – ఒక నూతన దృష్టికోణమును ఇస్తాయి మరియు ఆ దృష్టికోణంలో ఒక అధికారిక లేఖనముంది మరియు అది సంఘము కొరకు విశేషమైనది, ఇశ్రాయేలు దేశము కొరకు కాదు లేక పాత నిబంధనకు చెందినది కాదు.

క్రొత్త నిబంధనలో ప్రిస్కిల్ల మరియు ఫిబేలను ఉపయోగించి కూడా ఇలాంటి వాదములే చేస్తుంటారు. అపొ. 18లో, ప్రిస్కిల్ల మరియు అకుల క్రీస్తుకు నమ్మకమైన సేవకులుగా చూపించబడ్డారు. ప్రిస్కిల్ల తన భర్త కంటే పరిచర్యలో ఘనమైనదని సూచిస్తూ ప్రిస్కిల్ల పేరు ముందుగా పేర్కొనబడినది. ప్రిస్కిల్ల మరియు ఆమె భర్త అపొల్లోకు యేసు క్రీస్తు సువార్తను ప్రకటించారా? అవును, వారి ఇంటిలో “అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి” (అపొ. 18:26). ప్రిస్కిల్ల ఒక సంఘమునకు కాపరిగా ఉన్నదని లేక పరిశుద్ధుల సంఘమునకు ఆత్మీయ నాయకురాలు అయ్యిందని బైబిల్ చెబుతుందా? లేదు. మనకు తెలిసినంత వరకు, 1 తిమోతి 2:11–14కు విరోధంగా ప్రిస్కిల్ల పరిచర్యలో పాలుపంచుకొనలేదు.

రోమా 16:1, ఫీబేను “సంఘ పరిచారకురాలు” అని పిలిచారు మరియు పౌలు ఆమెను బహుగా మెచ్చుకున్నాడు. అయితే, ప్రిస్కిల్ల వలెనే ఫీబే సంఘములో పురుషులకు బోధించెనని లేఖనములో ఎలాంటి ఆధారము లేదు. “బోధింపతగినవాడు” అను అర్హత పెద్దలకు ఇవ్వబడినది, పరిచారకులకు కాదు (1 తిమోతి 3:1–13; తీతు. 1:6–9).

1 తిమోతి 2:11–14 యొక్క నిర్మాణము స్త్రీలు కాపరులు ఎందుకు కాకూడదో స్పష్టము చేస్తుంది. “ఎందుకనగా” అని 13వ వచనం ఆరంభమవుతుంది, మరియు 11–12 వచనాలలో పౌలు యొక్క వ్యాఖ్యలకు “కారణం” ఇస్తుంది. స్త్రీలు పురుషులపై ఎందుకు అధికారం కలిగియుండకూడదు లేక బోధించకూడదు? ఎందుకంటే “మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను” ( వచనములు 13–14). దేవుడు ఆదామును మొదట సృష్టించాడు మరియు తరువాత “సహాయం” కొరకు హవ్వను సృష్టించాడు. సృష్టి యొక్క వరుస కుటుంబముపై (ఎఫెసీ. 5:22–33) మరియు సంఘముపై సార్వత్రిక ప్రభావం కలిగియుంది.

స్త్రీలు కాపరులుగా పరిచర్య చేయకపోవుటకు లేక పురుషులపై ఆత్మీయ అధికారం కలిగియుండకపోవుటకు హవ్వ మోసపరచబడుట కారణమని 1 తిమోతి 2:14లో కూడా ఇవ్వబడినది. అంటే స్త్రీలు పురుషుల కంటే త్వరగా మోసపోతారని దీని అర్థం కాదు. ఒకవేళ స్త్రీలందరు సులువుగా మోసపరచబడువారైతే, పిల్లలకు (సులువుగా మోసపోయేవారు), మరియు ఇతర స్త్రీలకు (వారు కూడా సులువుగా మోసపోయేవరు) బోధించుటకు వారికి ఎందుకు అవకాశం ఇవ్వబడింది? హవ్వ మోసపరచబడినది కాబట్టి స్త్రీలు పురుషులపై ఆత్మీయ అధికారం కలిగియుండకూడదని మరియు వారు బోధించకూడదని వాక్య భాగం చెబుతుంది. సంఘము యొక్క ప్రాథమిక బోధా అధికారమును దేవుడు పురుషులకు ఇవ్వాలని నిర్ణయించాడు.

అనేక మంది స్త్రీలు ఆతిథ్యంలో, కరుణలో, బోధలో, మరియు సహాయంలో గొప్ప వరములు కలిగియున్నారు. స్థానిక సంఘము యొక్క పరిచర్య చాలా వరకు స్త్రీల మీద ఆధారపడియుంటుంది. సంఘములో స్త్రీలు బహిరంగ ప్రార్థన లేక ప్రవచనం నుండి నిషేధించబడలేదు (1 కొరింథీ. 11:5), కేవలం పురుషులపై ఆత్మీయ బోధా అధికారం నుండి మాత్రమే. పరిశుద్ధాత్మ వరములను ఉపయోగించుట నుండి బైబిల్ ఎక్కడా స్త్రీలను నిషేధించలేదు (1 కొరింథీ. 12). పురుషుల వలె స్త్రీలు కూడా ఇతరులకు పరిచర్య చేయుటకు, ఆత్మ ఫలములను ప్రదర్శించుటకు (గలతీ. 5:22–23), మరియు నశించినవారికి సువార్త ప్రకటించుటకు పిలువబడిరి (మత్తయి 28:18–20; అపొ. 1:8; 1 పేతురు 3:15).

సంఘములో ఆత్మీయ బోధా అధికారంలో పురుషులు మాత్రమే ఉండాలని దేవుడు నిశ్చయించాడు. ఇది పురుషులు మంచి బోధకులు మరియు స్త్రీలు తక్కువ వారు లేక తక్కువ జ్ఞానము కలవారు అని కాదు. ఇది దేవుడు రూపించిన సంఘ నిర్వహణ మార్గము. ఆత్మీయ నాయకత్వంలో పురుషులు మాదిరి కలిగి ఉండాలి – వారి జీవితాలలో మరియు వారి మాటల ద్వారా. స్త్రీలు తక్కువ అధికారిక పాత్రలు తీసుకోవాలి. స్త్రీలను ఇతర స్త్రీలకు బోధించుటకు ప్రోత్సహించాలి (తీతు. 2:3–5). స్త్రీలు పిల్లలకు బోధించుట నుండి బైబిల్ వారిని నిషేధించుట లేదు. పురుషులపై ఆత్మీయ అధికారం కలిగి వారికీ బోధించుట స్త్రీలకు నిషేధించబడిన ఏకైక కార్యం. ఇందును బట్టి స్త్రీలు పురుషులకు కాపరులుగా ఉండలేరు. ఇది స్త్రీలను ఏ విధంగాను తక్కువ ప్రాముఖ్యం గలవారిగా చేయదు, కాని దేవుని ప్రణాళిక ప్రకారం మరియు ఆయన వారికిచ్చిన వరముల ప్రకారం వారు పరిచర్య చేయుటకు అవకాశం ఇస్తుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

స్త్రీ కాపరులు/ప్రసంగీకులు? పరిచర్యలో స్త్రీలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries