settings icon
share icon
ప్రశ్న

రక్షణా ప్రణాళిక/రక్షణా మార్గం అంటే ఏంటి?

జవాబు


మీరు ఆకలిగా ఉన్నారా? భౌతిక ఆకలి కాదు, జీవితంలో ఇంకా ఏదో కోసం మీరు ఆకలిగొని యున్నారా? మీ లోలోపల ఏదైనా ఎన్నడూ సంతృప్తిపరచబడలేనిదిగా ఉందా? ఒకవేళ అవును అంటే, యేసే మార్గం! యేసు చెప్పాడు, “జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు” (యోహాను6:35).

మీరు కలవరంగా ఉన్నారా? జీవితములో ఒక గమనాన్నిగాని ఉద్దేశ్యాన్నిగాని ఎన్నటికిని కనుగొనలేనట్లుగా ఉన్నారా? ఎవరన్నా లైట్లు ఆపేస్తే మరలా వెలిగించుటకు కావాల్సిన స్విచ్ మీరు కనుగొనలేకయున్నారా? ఒకవేళ అవును అంటే, యేసే మార్గం! యేసు చెప్పాడు, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను” (యోహాను 8:12).

ఈ జీవితములో మీరు బంధించబడ్డారు అని ఎప్పుడైనా అనుకున్నారా? అనేక ద్వారములు ప్రయత్నించి, ఆ ద్వారముల వెనుక ఉన్నదంతయు కేవలం శూన్యము మరియు నిరర్ధకం అని కనుగొన్నారా? పరిపూర్ణమైన జీవితము లోనికి ప్రవేశాన్ని కోరుతున్నారా? ఒకవేళ అవును అంటే, యేసే మార్గం! యేసు చెప్పాడు, “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును” (యోహాను 10:9).

ఇతరులు ఎప్పుడు మిమ్ములను తక్కువగా చేస్తున్నారా? మీ సంబంధములు ఎప్పుడైనా నిస్సారముగా మరియు శూన్యంగా అనిపించాయా? అందరు నీ దగ్గర నుండి ప్రయోజనమునే ఆశిస్తున్నారని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అవును అంటే, యేసే మార్గం! యేసు చెప్పాడు, “నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును. నేను గొఱ్ఱల మంచి కాపరిని” (యోహాను 10:11, 14).

ఈ జీవితము తరువాత ఏమి జరుగుతుందోనని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? కేవలము తుప్పు మరియు మష్టు పట్టే వాటికొరకే మీ జీవితమును జీవించుటలో అలసిపోయారా? అసలు ఈ జీవితమునకు ఏమైనా అర్ధం ఉందా అని మీరు ఎప్పుడైనా సందేహించారా?మీరు మరణించిన తరువాత కూడా బ్రతకాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవును అంటే, యేసే మార్గం! యేసు చెప్పాడు, “అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు” (యోహాను 11:25-26).

మార్గము ఏంటి? సత్యము ఏంటి? జీవము ఏంటి? యేసు బదులిచ్చాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” (యోహాను 14:6).

మీరు అనుభవించే ఆకలి ఆత్మీయ ఆకలి, అది కేవలం యేసు మాత్రమె తీర్చగలడు. చీకటిని తొలగించగలవాడు యేసు ఒక్కడు మాత్రమే. సంతృప్తికరమైన జీవితమునకు యేసే ద్వారము. మీరు చూస్తున్న స్నేహితుడు మరియు కాపరి యేసే. యేసు జీవమైయున్నాడు – ఈ లోకమందు మరియు తరువాతి లోకమందు కూడా. యేసే రక్షణకు మార్గము!

మీరు ఆకలిగా అనుభవించుటకు కారణం, చీకటిలో మీరు తప్పిపోయినట్లు ఉండటానికి కారణం, జీవితములో అర్ధాన్ని కనుగొనలేకపోవడానికి కారణం, మీరు దేవుని నుండి వేరు చేయబడుట వలననే. మనమందరమూ పాపము చేసి దేవుని నుండి దూరమైపోయామని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది (ప్రసంగి 7:20; రోమా. 3:23). మీ హృదయములో మీరు అనుభవించే శూన్యము మీ జీవితములో దేవుడు లేకపోవడం వలననే. మనము దేవునితో సంబంధం కలిగియుండుటకు సృష్టించబడ్డాము. మన పాపమును బట్టి ఆ సంబంధము నుండి మనము వేరుపర్చబడ్డాము. ఇంకా ఘోరమైన విషయమేమంటే, మన పాపము మనలను దేవుని నుండి నిత్యత్వము అంతయు, ఈ జీవితములో మరియు రాబోయే జీవితములో కూడా వేరుపర్చబడునట్లు చేస్తుంది (రోమా. 6:23; యోహాను 3:36).

ఈ సమస్యను ఎలా పరిష్కరించగలము? యేసే మార్గం! యేసు మన పాపమును ఆయనపై మోసాడు (2 కొరింధీ. 5:21). యేసు మనము పొందవలసిన శిక్షను ఆయనపై వేసుకొని మన స్థానంలో మరణించాడు (రోమా. 5:8). మూడు దినముల తరువాత పాపము మరియు మరణములపై ఆయనకు గల విజయాన్నినిరూపిస్తూ మృతులలో నుండి తిరిగి లేచాడు (రోమా. 6:4-5). ఆయన ఇది ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నకు యేసే స్వయంగా సమాధానమిచ్చాడు: “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు” (యోహాను 15:13). మనము జీవించులాగున యేసు మరణించాడు. ఒకవేళ మనము యేసులో మన విశ్వాసము ఉంచితే,ఆయన మరణమును మన పాపముల యొక్క క్రయధనముగా నమ్మితే, మన పాపములన్నియు క్షమించబడి శుద్ధి చేయబడతాయి. అప్పుడు మన ఆత్మీయ ఆకలి తీరుతుంది. అప్పుడు లైట్లు వెలుగుతాయి. పరిపూర్ణ జీవితమునకు మనకు పొందు ఉంటుంది. మనము మన నిజమైన శ్రేష్ట స్నేహితుణ్ణి మరియు మంచి కాపరిని తెలుసుకుంటాము. మనము మరణించిన తరువాత మనకు ఒక జీవితము ఉంటుందని – అంటే నిత్యత్వము కొరకు పరలోకములో యేసుతో పునరుత్ధానమైన జీవితము ఉంటుందని మనకు తెలుస్తుంది.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16).

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "క్రీస్తును నేడు అంగీకరించితిని" అను బటన్ క్లిక్ చేయండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

రక్షణా ప్రణాళిక/రక్షణా మార్గం అంటే ఏంటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries